శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి చరిత్ర మీ అందరికోసం!

-పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్టి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాలరాశి. పెళ్లయ్యి చాలాకాలం దాకా సంతాన భాగ్యం కలుగలేదు. జ్యోతిష్య సంప్రదిస్తే యాగం చెయ్యమని చెప్పారు.

అందుకని, కుసుమశ్రేష్టి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించింది. ఆమె ఆ దంపతులకు రెండు ఫలములను ప్రసాదించింది.

కౌసుంబిని భుజించమంది.

ఆ ఫలములను భుజించిన కౌసుంబి పది నెలలో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను కవలపిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడశిసువుకు వాసవి అని, విష్ణు అంశంతో పుట్టిన మగశిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు.

కుసుమశ్రేష్టి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసినవారందరు ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమశ్రేష్టి.

వాసవి విరూపాక్షలు యుక్తవయస్కులైయ్యారు.

ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు, రాజు విష్ణువర్ధనుడు.

అలా వెళ్తు కుసుమశ్రేష్టి ఇంటిముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా వున్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి, వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్టికి తెలియజేయగా… అయ్యా మేము వైశ్యులము. క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యమందుకోలేము. ఇది అసాధ్యం అన్నాడు కుసుమశ్రేష్టి.

ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని, అనుమతి తెలపమని, మంత్రిని మళ్లీ రాయాబారానికి పంపాడు విష్ణువర్ధనుడు.

దీంతో పెనుగొండ ప్రజలు, శ్రేష్టి కూడా అయోమయంలో పడ్డారు.

ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయల్దేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీరించమని కుసుమశ్రేష్టి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్టి. “తండ్రి! అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలాచేసినా నాకేం కాదు మీరు దిగులుచెందకండి” అని, వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చి, అక్కడి జనంతో, “అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు. ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది.”

వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది. అందరు అగ్నిగుండం లోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి.

అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. “ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది” వాసవి.

విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దు ల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేందడు క్రుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించ బడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్ధించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు.

ఆలయ నిర్మాణం…

-పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటిచెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు. ధ్వజస్తంభం. దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్టించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి. ఆ తర్వాత తోరణమండపం వెనుకవైపు ద్వారం కనిపిస్తుంది.

వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్నగోపురం వున్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు. పుట్టలో వున్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం. ప్రధాన మండపంలో మూడు గర్భగుడులువరుసగా వున్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువైయ్యాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం.

ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైం ది. ఒకచేత చిలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు, పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది. వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి.. ఆ వాసవి దేవి, వంశప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్దపడిన వాసవిదేవి త్యాగనిరతి కొనియాడబడినది.

ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణకధ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైన కన్నీటి పర్వంతమౌతారా నడం అతిశయోక్తి కాదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యదార్ధగాధకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లగా వున్న ఈ అగ్నిగుండం. ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పక్షుల కలరవాలు కూడా ఈచోట వినిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసు కొని మౌనం వహించేలా అనిపిస్తుంది మరి. ఎంత కటోరమైన మనసున్న వారినైన దయార్ధ్రులుగా మార్చగల శక్తి వున్న అగ్నిగుండ మండపం అని అంటారు.

చాలా పెద్ద దేవాలయం ఇది. పాత దేవాలయానికి, కొత్త ఆలయానికి మధ్యదూరం ఒక కిలోమీటరు ఉండవచ్చును.

మేము వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కూర్చుని వ్రతాలు, కుంకుమపూజలు, మరేవో పూజలు చేస్తున్నారు.

అద్భుతమైన ఆలయం ఇది.

కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని తొంభై అడుగుల పొడవు, అరవై టన్నుల పంచలోహంతో తయారుచేసి ప్రతిష్టించిన అతి భారీ మూర్తి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఉంది, ఈ ఆలయం.

తప్పకుండా దర్శించుకునే ఆలయమే!

***

శుభోదయం అమ్మ,

వాసవి మాత చరిత్ర, పెనుగొండ దేవాలయం గురించి చాలా బాగా చెప్పారు.

నేను కూడా ఆర్య వైశ్య కులానికి చెందినవాడిని. కానీ చరిత్ర ఇప్పుడు బాగా తెలిసింది.

అమ్మ వారితో పాటుగా ఇంకో 108 మంది ఆతర్పణం చేసారు, ఆలా మా కులం లో 108 గోత్రాలు వచ్చాయి.

కృతజ్ఞతలు అమ్మ 🙏

Categorized in: