ఎప్పటినుంచో, మళ్ళీ ఒకసారి కోనసీమ దర్శనం చేసుకోవాలని కోరిక! క్రితం సారి Ramana Gadepalli రమణ గారు చూపించారు. మళ్ళీ రావాలంటే కుదరటం లేదు.

అనుకోకుండా, నేను, Janaki Prabhala గారు, కాకినాడ వంగూరి ఫౌండేషన్ వారి తెలుగు మహాసభలలో ప్రసంగించటానికి వచ్చి కలిసాము. అప్పటికే జానకి గారు వారి ఊరిలో యజ్ఞం జరుగుతోంది, కనుక మీకు ఇలాంటివంటే ఇష్టం ఉంది, కనుక వారి ఇంటికి రమ్మని ఆహ్వానించారు.

కాకినాడ ప్రోగ్రాం అవగానే, వారితో పాటు నేనుకూడా పుల్లేటికుర్రు గ్రామం వచ్చాను. వచ్చేటప్పటికి చాలా రాత్రి అయిపొయింది. నల్లటి చీకటిలో కీచురాళ్ళ ధ్వని, కప్పల బెకబెకలు తప్పా అందాలేమి కనిపించలేదు. వినిపించాయంతే! (ఇలయారజ) సంగీతంలా వింటూ వచ్చేసాము.

వారి ఇంటికి చాలా దగ్గరైన వ్యాగ్రేశ్వరంలోనే యజ్ఞం జరుగుతున్నది.

నిన్న ఉదయం నిద్రలేచి, కొబ్బరి ఆకుల మధ్యలోనుంచి దోబూచులాడుతూ, పచ్చని చేలమీద పడుతున్న బంగారు రంగు కిరణాల ఆ అందం గురించి చూడవలసినదే గానీ వర్ణించ మాటలే లేవు.

ఇరువురమూ తయారై వ్యాఘ్రేశ్వరంలో, యజ్ఞం జరిగే చోటుకు బయలుదేరి, ఆ చల్లని ఉదయం, సన్నని కాలి బాటలో, ఒకప్రక్క చిన్న పిల్లకాలువలు, అక్కడక్కడా దానిలో బట్టలూతుకుంటున్న స్త్రీలను చూస్తూ, మరొక చోట అదే కాలువ దగ్గర మెట్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకున్నవారు, మరొక ప్రక్క పచ్చని కొబ్బరి తోటలు, పచ్చని చేలు, పెంకుటిల్లు లన్నీ, రెండు, మూడంతస్తులతో కట్టుకుంటున్న ఇల్లు, పశువులు, గడ్డిమేట్లు అన్నీ పల్లే అందాలనూ చూసుకుంటూ, దారి పొడుగునా, జానకి గారిని గోదారి యాసతో స్వఛ్చమైన కోనసీమ తెలుగు భాషలో, “బాన్నారా అమ్మా! ఎప్పుడొచ్చారు? ఉంటారా, పదిరోజులు, ఎదన్నా అవసరముంటే ఫోన్ చెయ్యండి” అంటూ పలకరించే పల్లే జనాలను చూస్తూ 50 సంవత్సరాల క్రితం జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తెలియకుండానే, మార్నింగ్ వాక్ పూర్తిచేసుకుని, నెమ్మదిగా వ్యాఘ్రేశ్వరం వచ్చాము.

ఆలయ ప్రవేశానికి ముందుగా తులసి కోట, చెరువు, వనదుర్గ అమ్మవారి దర్శనం! తరువాత ఆలయ ప్రవేసానంతరం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం! ఇక్కడ వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొంత మనిషి ఆకారంలోనూ, మరికొంత సర్పాకారంలోనూ ఉన్నాడు.

మొదట వినాయకుడిని దర్శించి, జానకి గారు తియ్యని గొంతులో గణేశ పంచరత్న స్తోత్రం, పాడుతుంటే, ఆలయంలోని భక్తులందరూ విన్నారు, శ్రద్ధగా! ముందుగా బాలాత్రిపురసుందరీ అమ్మవారిని దర్శించి అమ్మవారి మీద ఒక కీర్తన పాడుకుని, స్వామిని దర్శించి, అభిషేకం చేయించుకుంటే, ఉత్సవమూర్తి ఆలయము, యజ్ఞ్రశాల చుట్టూ ఊరేగి ఆలయ ప్రవేశం చేశాడు, మేళతాళాలతో! ఆయన వెనుకే కచ్చబోసి చీరలు కట్టుకున్న స్త్రీలు, పట్టుపంచలతో పురుషులు చూస్తుంటే, మన ఇంటిలో జరుగుతున్న ఉత్సవమా అనిపించింది. ఆసందడితో కూడుకున్న వాతావరణాన్ని చూస్తుంటే, కల్మషంలేని ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు.

స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామపంచాయతీ ఆఫీసుకు దగ్గరలోని ఇంటిలో నందికేశుడి నోము దగ్గర ఆ ప్రసాదాన్ని స్వీకరించి, యజ్ఞం చేసే యజమాని ఇంటిలో క్రతువుకు ముందుజరిగే కార్యక్రమాన్ని దర్శించుకుని, అక్కడ చిన్నపిల్లల నోట వేదపారాయణ కొంచెంసేపు విని, పెద్దలు, పూజ్యులు ఎంతోమంది “యాజులను” దర్శించుకుని, యజ్ఞక్రతువు మొదలు పెట్టడానికి తమ ఇంటి నుంచి స్త్రీపురుషులు ఊరేగింపుగా మేళతాళాలతో వెడుతుంటే వారివెనుకే యజ్ఞశాల వరకూ వెళ్ళటం సరికొత్త అనుభవం నాకు!

ఇటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చిన జానకీ ప్రభల గారి దంపతులిరువురుకి కృతజ్ఞతలు!

పుల్లేటుకుర్రు, వ్యాఘ్రేశ్వరం ఊర్లకు ప్రేమ మాత్రమే ఇవ్వగలను!❤️❤️❤️

ఆలయానికి వందనం!🙏

కోనసీమ వర్ధిల్లాలి!

ఇతరమత కోరలనుంచీ ఆ ప్రాంతాన్ని రక్షించాలి అని ఆ స్వామిని కోరుకుని మరీ వచ్చాను.

#ఆలయంవర్ధిల్లాలి

Categorized in: