నా చిన్నతనంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్లే దారిలో, ‘కరప’ అనే ఊరినుంచి, అరట్లకట్ట వెళ్లే వైపుగా మళ్ళే దారిలో కరపకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు మాది. అదే, ‘కొరుపల్లె’ అనే గ్రామం. మొత్తం వంద గడపలు కూడా ఉండేవి కావు. అందులోనే పది కులాలుండేవి. ఎప్పుడు, ఎవరం మాట అనుకున్న జ్ఞాపకం లేదు. పిల్లలమైతే ఎప్పుడు కలిసి మెలిసే ఉండేవాళ్ళం.
మా ఊరు మొత్తానికి తాగే నీరు లేదంటే, ఇప్పుడెవరూ నమ్మరు. అప్పట్లో ఇంటికి రెండు బావులు, ఒక దొరివి ఉండేవి. కానీ, తాగటానికి, వంటకు పనికి వచ్చేవి కావు. ఇళ్లల్లో ఉండే నీరంతా ఉప్పునీరే. సముద్రానికి చాలా దగ్గర పల్లెల్లో సాధారణంగా ఉప్పునీరే ఉండేది.
ఊరికి దూరంగా పొలాల మధ్యలో, కరణంగారి చేలని ఉండేవి. అక్కడొక మామిడి తోటలో బావిలో తాగటానికి పనికివచ్చే నీరు ఉండేది. ఊరంతా అవే, నీరు తెచ్చుకోవాలి. ఉదయం పది గంటలకు పనంతా చేసుకుని ఆడువారంతా మూకుమ్మడిగా తలో రెండు బిందెలు, ఒక బకెట్టూ తీసుకుని ఆ బావికి వెళ్లి నీరు తోడి ఆ బరువు మోసుకుంటూ, తెచ్చుకునేవారు. సాయంత్రం ఐదు అయితే ఆ బావిదగ్గరకు నక్కలు వచ్చి ఊళలు వేస్తూ ఉండేవి. ఎప్పుడైనా గుంపుతో వెళ్లలేక పోతే ఒక్కరం వెళ్లాలంటే చాలా భయం వేసేది. అయినా తాగటానికి ఆ నీరే ఆధారం కనుక తప్పని సరిగా హనుమాన్ చాలిసా చదువుకుంటూ తెచ్చుకునే వాళ్ళం.
అప్పట్లో డబ్బులిస్తే నీళ్లు తేవటాలు అవి ఏమి లేవు.
ఆడవారు గానీ, మగవారు కావిడి భుజాన వేసుకుని నాలుగేసి బిందెలు మోసుకొచ్చి ఇంట్లో పెడితే, జాగర్తగా వాడుకోవలసి వచ్చేది.
అప్పుడు అలా వెళ్లే వాళ్ళల్లో నేను కూడా ఒక మెంబర్ నే! ఆ నీటి వ్యథలలో అవి, మరిచి పోవటానికి ఇంట్లో ఉన్న ఉమ్మడి కుటుంబ సభ్యుల మీద వచ్చిన చిన్నచిన్న మనస్పర్ధలను ఒకరితో ఒకరు పంచుకునే వారు. కానీ ఇప్పటిలా Fb గోడలెక్కి సంఘానికి చేటు తెచ్చే కార్యక్రమాలు అప్పటి జనానికి తెలియవనుకుంటున్నాను.
*
అలాగే, మా పెద్ద మేనమామ గారి ఊరు, పెదపట్న అగ్రహారం. అక్కడా ఇంట్లో మంచినీరుండేది కాదు. పెదపట్నం వెళ్లి గోదారిలో నీళ్లు తెచ్చుకుని వాడుకునే వాళ్ళం. వరదలలో అయితే మరీ కష్టంగా ఉండేది. వరద నీరంతా, ఎర్రటి బురద నీరుగా వచ్చేది. దానిలో బురద ఎక్కువగా ఉండేది. అందుకని చాలా సార్లు తెచ్చుకోవలసి వచ్చేది. చాలా బిందెలు మొయ్యాలిసొచ్చేది. కుటుంబానికి ఇరవై బిందెలు పట్టేవి. వాటిని తెచ్చి పటిక కలిపి అట్టెపెడితే, రెండు రోజులకు తేరి తాగటానికి పనికి వచ్చేవి. అలాంటి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఆడగాని, మగగాని సంఘాన్ని పాడుచేసే పిచ్చి మాటలకు సమయం ఉండదు. మనసులోని ఆవేదన తగ్గే విషయాలకు ఓదార్పుగా ఉండే మాటలు మాత్రమే ఉంటాయని నాకు తెలుసు. ఎందుకంటే, ఆ నీటి ఎద్దడి ఎదుర్కొన్న వారిలో నేను ఉన్నాను కనుక.
ఇక పైదంతా పంతొమ్మిది వందల అరవై నుంచి డెభై వరకు ఒక దశాబ్దకాలం మాత్రం చవిచూసాను.
రెండువేల పద్ధెనిమిదిలో రాజస్థాన్ యాత్ర చెయ్యటానికి నా మార్వాడి స్నేహితురాలితో వెళ్ళాను. వారి బంధుమిత్రుల ఇళ్లకువెళ్ళాను. ఆ సమయంలో చాలా ఊర్లు వెళ్ళాము. అలా వెళ్లిన వాటిల్లో, రాజస్థాన్ రణతంబోర్ లోని చాలా చిన్న పల్లెలకు కూడా వెళ్ళాను. అప్పటి వరకూ నీటి కోసం ఇబ్బందులు పడిన వారిలో, నేనున్నాను అనుకునే దానను. అలాంటిది, నాకు కూడా భయంకరమైన ఒక నిజం ప్రత్యక్షంగా చవి చూసాను. అదే, రాజస్థాన్ నీటి ఎద్దడి.
రోజుకు సగటున ఒక మనిషికి తక్కువలో తక్కువ వాడితే ఏభై నుంచి డెభై లీటర్ల నీరు కావాలి. కానీ రాజస్థాన్ లోని ఆ చిన్న పల్లెలో వారికి, పది నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి మనిషికి పది నుంచి ఇరవై లీటర్ల నీరు మాత్రమే దొరుకుతుందట. ఆ నీటితో వారు ఏమి చెయ్యగలరో ఆలోచించండి.
వారు నీటిని బంగారం కంటే అపురూపంగా చూడటం నా కళ్లతో చూసాను.
మేము అక్కడ ఉన్నది ఒక గంట సేపు మాత్రమే, పదిలీటర్ల బిస్లరి వాటర్ కేన్ మా కారు డిక్కీలోంచి వికృతంగా నవ్వింది మమ్మల్ని చూసి. మేము అక్కడ చూసిన దృశ్యం, ‘నెలలు నిండిన గర్భిణీ స్త్రీ ఎనిమిది కడవలను తలమీద, రెండు కడవలు చంకల్లోనూ మోసుకుంటూ వస్తున్న దృశ్యం చూసి మనసు కొన్ని గంటలు స్థబ్ధతను అనుభవించింది.
ఈ బొమ్మ పోస్ట్ చేసి, నవ్వుతున్న అందరిని చూసి, ఆ జ్ఞానానికి నవ్వొచ్చింది నాకు. సమస్యను ఒక వైపుగా చూసి నవ్వుకోవటం కంటే, ఆది అలా ఎందుకుంది అనుకుంటే, కొంచెం అయినా దారికనిపిస్తుందేమో మార్చటానికి.
ఇప్పుడుకూడా ఈ బొమ్మనుచూసి హాయిగా నవ్వుకోవచ్చును. ఈ సమస్యలో నేనులేను గనుక.
Thank God!!